Friday, November 26, 2010

మా అబ్బాయి "సంకష్ట వ్రతం" చేస్తున్నాడెందుకో..!

రాత్రి ఆఫీసులో స్టాఫ్‌ తక్కువగా ఉండడం.. ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వార్తా కథనాలు రాయడం, రాయించాల్సి ఉండడంతో.. 24వ తేదీ రాత్రి ఆఫీసులోనే గడిపాను. 25వ తేదీ అంటే, నిన్న ఉదయం 8 గంటలకు, 10 గంటలకు ప్రాంతీయ వార్త బులెటిన్లు పూర్తి చేసి ఇంటికి వచ్చాను. అప్పుడు మా శ్రీమతి ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది.

మా అబ్బాయి వికాస్‌ (తను టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నాడు) సంకట హర వ్రతాన్ని చేస్తానని చెప్పాడట. ఆమేరకు దేవుడి గదిలో.. విఘ్నేశ్వరుడి ప్రతిమ ముందు సంకల్పించుకుని.. మా ఆవిడ వారిస్తున్నా వినకుండా ఏమీ తినకుండా, లంచ్‌ బాక్స్‌ తీసుకోకుండా స్కూలుకి వెళ్లిపోయాడట. (ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్ని స్నానాదికాలు ముగించి, గణపతి ముందు కూర్చుని దీప, ధూపాలతో పూజించి, "రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రికి సంకష్ట వ్రతాన్ని ఆచరిస్తా.." అని స్వామి ముందు సంకల్పించుకుంటారు. రాత్రి వేళ పూజ చేసి.. స్వామికి నివేదించిన పదకొండు కుడుములలో ఓ ఐదింటిని మాత్రమే తిని ఉపవాస దీక్ష విరమించి, నిద్రిస్తారు. ) మా అబ్బాయి ఈ వ్రతాన్ని చేస్తాననడం నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా ఈ వయసులో పిల్లలు ఆటపాటలతో.. స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మా అబ్బాయి వ్రతాల వైపు ఆకర్షితుడవుతున్నాడేంటా అని ఆలోచించా. అయినా.. ఆకలికి తనెక్కడ తట్టుకుంటాడులెమ్మని సర్ది చెప్పుకున్నా.
ఆఫీసులో పని ముగించుకుని నిన్న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి, మా అబ్బాయి.. వాళ్లమ్మ (నా శ్రీమతి) ఇద్దరూ వ్రతాచరణలో హడావుడిగా ఉన్నారు. ఏదో ఆషామాషీగా అనుకున్నా గానీ.. మా అబ్బాయి సంకష్ట వ్రతాచరణ పట్ల నిజంగానే పట్టుదలతో ఉండడం అబ్బురపరిచింది. వికాస్‌ ముఖం కాస్త వడిలినట్లున్నా.. కాంతిమంతంగా ఉండడం కాస్త ఆలోచించేటట్లు చేసింది. ఏమైతేనేం.. తను, వాళ్లమ్మతో కలిసి దిగ్విజయంగా వ్రతాన్ని ఆచరించాడు.

పదో తరగతి చదువుతున్నాడు కదా..! ఒకవేళ పరీక్షలంటే భయపడి ఇలా వ్రతాల వైపు మొగ్గు చూపుతున్నాడేమో అని అనుమానం వేసింది. అదే విషయాన్ని మా అబ్బాయిని అడిగా.. నథింగ్‌ డూయింగ్‌ 550 మార్కులకు పైబడే వస్తాయి.. మరికాస్త చదివితే ఇంకొన్ని మార్కులు వస్తాయి.. అన్నాడు. (అది నిజమే) మరి ఈ వయసులో ఇంత కఠినమైన వ్రతాన్ని ఎందుకు మొదలు పెట్టావు..? అని ఆరా తీశా. జస్ట్‌ ఇదెలా ఉంటుందో చూద్దామనిపించింది.. చేశా దట్సాల్‌ అన్నాడు. ఎలా అనిపించింది..? అంటే.. బావుంది అన్నాడు.
మా అబ్బాయి వ్యవహారాన్ని పరిశీలించాక, ఈ తరం ఓ కొత్త విషయాన్ని తెలుసుకుంటే.. దాన్ని ప్రయోగాత్మకంగా రూఢీ చేసుకునేదాకా నిద్రపోరు కాబోలు అనిపించింది.
మా అబ్బాయి సంకట హర గణపతి వ్రతాచరణ తర్వాత చంద్రదర్శనం చేసుకుని త్వరగానే నిద్రపోయాడు. సో నేను మెయిల్స్‌ చెక్‌ చేద్దామని నెట్‌ ఓపెన్‌ చేశాను. సిస్టమ్‌ డెస్క్‌టాప్‌పైన పేరు పెట్టని ఓ unknown ఫోల్డర్‌ కనిపిస్తే ఓపెన్‌ చేశా. అందులో మా ఫ్యామిలీ ఫోటోలున్నాయి. బాగా పరిశీలించి చూస్తే.. మా అబ్బాయి ఆధ్యాత్మిక ధోరణిని చాటే మరికొన్ని సందర్భాలు.. ఫోటోల రూపంలో కనిపించాయి. వినాయక చవితి రోజున పూజ చేసినప్పటి ఫోటో, తన ఆరేళ్ల వయసులో.. నాతోపాటు అయ్యప్ప స్వామి దీక్ష చేసినప్పటి ఫోటోలు, తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళుతున్నప్పుడు ప్రకృతిని ఆరాధిస్తూ.. అక్కడి అడవి జంతువుల పట్ల ఆదరణ కనిపిస్తున్న సందర్భానికి సంబంధించిన ఫోటోలు, తన పుట్టిన రోజున నేను ప్రెజెంట్‌ చేసిన పెంపుడు శునకం శాండీతో మా అబ్బాయి ఆటలకు సంబంధించిన ఫోటోలు.. ఇలా రకరకాల ఫోటోలు ఆ ఫోల్డర్‌లో కనిపించాయి. అంతేనా దసరా రోజున మా అమ్మగారికి పాదాభివందనం చేస్తూ.. ఆమెతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్నప్పటి ఫోటో కూడా అందులో ఉంది.

వీటన్నింటినీ చూశాక.. నాలో ఓ రకమైన భరోసా కలిగింది. చెప్పొద్దూ.. ఉన్నది ఒక్కగానొక్క నలుసాయె.. ఎక్కడ చెడు స్నేహాల వైపు వెళతాడో అని నేనూ, నాభార్యా భయపడుతుంటాం. అది పటాపంచలై పోయింది. (మా అబ్బాయికి కావలసినంత స్వేచ్ఛనిచ్చాను. అలా అని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించలేదు. చాలా పద్ధతిగా పెరిగాడు.. కానీ ప్రేమ ఎక్కువ ఉన్న చోట భయం
కూడా అంతేస్థాయిలో ఉంటుందంటారే.. ఆ ప్రకారం ఎక్కడ పాడై పోతాడో అన్న భయం ఎంత వద్దనుకున్నా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటోంది. ) శ్రుతి మించని స్థాయిలో ఆధ్యాత్మిక ధోరణి ఉంటే.. పిల్లలు చెడు నడవడికకు దూరంగా ఉంటారన్నది నా ప్రగాఢ నమ్మకం. మా అబ్బాయి ఆ దిశగా సాగుతున్నాడు. మరి ఇంటర్‌, గ్రాడ్యు‍యేషన్‌ లలో కూడా ఇదే సత్ప్రవర్తనను కొనసాగిస్తే.. తను దారిలో పడ్డట్లే. తల్లిదండ్రులుగా మేము భరోసాగా ఉండొచ్చనుకుంటా.. ఏమంటారు..?

నోట్‌ : ఈ పోస్టుతో పాటు వేస్తున్న ఫోటోలు మా పద్నాలుగేళ్ల అబ్బాయి వికాస్‌ వివిధ సందర్భాల్లో తీయించుకున్న ఫోటోలు.

1 comment:

  1. Really goog habit sir, may lord ganesh bless your son.

    Ramu

    ReplyDelete